Thursday, September 30, 2010

అభ్యుధయ కవి: గురజాడ అప్పారావు గారు


గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.


గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు  వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.


విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.. అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వసరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లి లో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరంకి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరు గా చేరారు.


1885 లో అప్పారావు గారు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887 లో సంవత్సరంలో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ పుట్టారు. 1890 లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించారు.

అప్పటి కళింగ రాజ్యం గా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావుగారు ఉండడం జరిగింది. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో మంచి సంబంధాలు ఉండేవి. 1887 లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వీరు మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాన్గిక సేవకై "విశాఖ వలంటరి సర్వీసు" లో చేరారు. 1889 లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.

ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావు తో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం "సారంగధర" "ఇండియన్ లీషర్ అవర్" లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తా లో ఉన్న "రీస్ అండ్ రోయిట్" ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావు గారిని తెలుగులో రచన చేయడానికి  ప్రోత్సహించారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాశేనని, తన మాత్రు భాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరనిఅన్నారు. గుండుకుర్తి వెంకట రమణయ్యగారు, "ఇండియన్ లీషర్ అవర్"ఎడిటరు కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించారు. 1891 లో విజయనగర సంస్థానంలో సంస్థానశాసనపరిశోధకునిగా నియమింపబడ్డారు.

1897లో మహారాజ ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి ఆంతరంగిక సెక్రెటరీగా నియమింపబడ్డారు.


1892 లో గురజాడ వారి "కన్యాశుల్కం" నాటిక వేయబడింది. అది మొదటి సారే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రజోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. ఈ నాటకం సాంఘిక ఉపయోగం తో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడచ్చని నిరూపించింది. దీని విజయంతో , అప్పారావు గారు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి గారుముఖ్యులు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రసంసించడంతో అప్పారావు గారికి ఎంతో పేరు వచ్చింది.

1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ , మద్రాసు వారు ప్రచురించారు. ఇది అప్పారావు గారు - మహారాజ ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో "కన్యాశుల్కం" తిరిగి వ్రాసారు. 1910 లో "దేశమును ప్రేమించుమన్నా" అన దేశ భక్తీ గీతాన్ని వ్రాసారు, ఇది ఎంతో పేరు పొందింది. 1911 లో మద్రాస్ విశ్వవిద్యాలయం "బోర్డు అఫ్ స్టడీస్" లో నియమించబడ్డారు . అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి "ఆంధ్ర సాహిత్యపరిషత్తు" ప్రారంభించారు.

1913 లో అప్పారావు గారు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు.

  
వీరి ఇతర రచనలు:


  • ది కుక్ - ఆంగ్ల పద్యం - 1882
  • సారంగధర - ఆంగ్ల పద్య కావ్యం -1883
  • చంద్రహాస - ఆంగ్ల పద్య కావ్యం
  • విక్టోరియా ప్రశస్తి - విక్టోరియా మహారాణిని పొగుడుతూ రీవా మహారాణి తరపున అప్పటి భారత వైస్రాయి కి ఆంగ్ల పద్యాలు -1890
  • కన్యాశుల్కము – నాటకం - మొదట -1892, తర్వాత -1909
  • శ్రీ రామ విజయం మరియు జార్జి దేవచరితం - ఆంగ్లవ్యాఖ్య మరియు పరిచయం -1894
  • సి పి బ్రౌన్ దొర వారి "తాతాచారి కధలు" మరియు "ది వార్స్ ఆఫ్ రాజాస్, బీయింగ్ ది హిస్టరీ ఆఫ్ హందె అనంతపురం" తిరిగివ్రాసారు. - ఇవి అప్పారావు గారు కాలం చెందినా తర్వాత ప్రచురించబడ్డాయి- 1890
  • హరిశ్చంద్ర - ఆంగ్ల నాటకముకు ఆంగ్లంలో వ్యాఖ్య మరియు పరిచయం – 1897
  • మిణుగుర్లు - పిల్లల కధ – 1903
  • కొండుభట్టీయం - అసంపూర్ణ హాస్య నాటిక – 1906
  • నీలగిరి పాటలు - నీలగిరి కొండల అందాలను వర్ణించే పాటలు -1907

పత్రికలలో వ్యాసాలూ -
  • మద్రాస్ కాంగ్రెస్ పార్టీ సంవత్సర సమావేశంలో బ్రిటిష్ పాలకులను తరిమికొట్టే విషయంలో భారతీయులలో ఉన్న లోపాలను విమర్శిస్తూ వ్రాసినవి.
  • "చన్న కాలపు చిన్న బుద్ధులు," - హాలీ తోకచుక్క విషయమై ప్రజలలో వచ్చిన మూఢ నమ్మకాలను విమర్శిస్తూ వ్రాసిన వ్యాసం – 1910
  • " ముత్యాల సరములు" మరియు "కాసులు" - అప్పారావు గారు తమ స్వంత ఛందస్సులో - మాత్ర ఛందస్సు - చేసిన పద్యాలు – 1910.
దేశభక్తి గీతం
  • “దేశమును ప్రేమించు మన్న" 1910

Thursday, September 9, 2010

రంజాన్

ముస్లింలకు అతిపవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే.

నెలవంకను చూసినప్పట్నుంచీ ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు.

ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో ముస్లిం మతస్థులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు.

రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం.

ముస్లింల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో ఈ రంజాన్ పండుగ వస్తుంది. మన క్యాలెండర్‌లో లాగా వారి క్యాలెండర్‌లోని నెలల్లో 30, 31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్రదర్శనం నుంచి వారికి నెలా మొదలవుతుంది.

సంవత్సరం అంతా ఏ దానాలు, చేయకపోయినా, ఉపవాసాలు ఉండపోయినా రంజాన్ నెలలో తప్పకుండా దానధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలు (ఉపవాసాల)ను తప్పక పాటిస్తారు.

రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది

'జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది వున్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుంది.

దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.

Wednesday, September 1, 2010

వినాయక చవితి కథ

సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.


పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.


కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.


శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహాశివుని వాహన మైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లు గా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని' వేడు కొన్నాడు.


అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థాన మయ్యాడు.


వినాయక జననము


కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు అతని తల నరికి లోపలికి వెళ్లాడు.


అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు.అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.


కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.


విఘ్నేశాధి పత్యము


ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు.


ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.


'సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం!
గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'


కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవ గలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.

అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'


ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.


పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'

ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట


ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే!


దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.


శమంతకోపాఖ్యానము


ద్వాపర యుగములో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.


కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉన్నది. అది సూర్యవరము వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారము నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.


ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.


ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.


అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష!నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.


ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.


శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది.


దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు అ మణినిస్తే నేనువెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.


తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరిం చి, మణిని మృదువుగా తిరస్కరించాడు.


ఒక శుభముహుర్తమున శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి? అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశమున చంద్ర దర్శనము అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక 'అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.


'కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చరుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు.

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చ...